నవ్వు, నవ్వించు!
“నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వలేక పోవడం ఒక రోగం” నవ్వడం మీద -జంధ్యాల మాటలు నవ్వు విషయం గుర్తుకొచ్చి నాలో నేనే నవ్వుకున్నా- ఒక్కణ్ణే ఉన్నా-పక్కన ఎవరైనా ఉంటే పైకే నవ్వేసేవాణ్ని- వాళ్ళతో నేను ఇప్పుడు రాసేవన్నీ పంచుకునేవాణ్ణి.అంచేతే నాలోనేనే నవ్వుకుని మీ అందరికీ తెలియాలని రాస్తున్నా-నా నవ్వు గురించి-నవ్వులాట కాదు- నవ్వు గురించి చాలా సీరియస్ గా చెప్పే ఉద్దేశమే ఇదే- నవ్వకండి మరి.
నవ్వు గురించి అన్నా కదా అని ఇదేదో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం మాత్రం కాదు- నవ్వు గురించి మాత్రమే! ఈమధ్య మనం ఎవరం గ్రహించలేదు గానీ మనం నవ్వడం మర్చిపోయాం అనిపిస్తుంది.పూర్వం నవ్వనిరోజు ఉండేదే కాదు,రోజులో లెక్కలేనన్నిసార్లు నవ్వుకునేవాళ్ళం- మొన్నామధ్య వరకు-ఎందుకని సడన్ గా చాలామంది నవ్వడం మానేశారు.
“నవ్వు నాలుగు విధాలా చేటు” అనే సామెతని ఘాడంగా గుర్తుపెట్టుకున్నట్టున్నారు కొంతమంది- నవ్వడం మర్చిపోయారు!
నా వరకు నేను ఒక్కణ్ణే ఉన్నప్పుడు లోపలే నవ్వుకోవడం, ఒక్కోసారి పైకి నవ్వుకోవడం చేస్తుంటాను.పదిమందిలో ఉన్నప్పుడుగానీ- ఇంకోవ్యక్తితో మాట్లాడేటప్పుడుగానీ- నవ్వు వచ్చే సంభాషణలో, లేదా సంభాషణల వల్ల నవ్వు వచ్చినా- నిక్షేపంగా మనస్ఫూర్తిగా నవ్వేస్తాను- మొహమాటం లేకుండా, అవును,నేనేకాదు చాలామంది ఇలాగే చేస్తున్నారు.
మన నవ్వును చూసి ఎవడో మొహం మాడ్చుకుంటాడని నవ్వడం మానేస్తామా- మనది “నవ్వు మొహం” అయితే వాళ్ళది “ఏడుపుగొట్టు మొహం” అయివుంటుంది- దానికి మనదా బాధ్యత; నవ్వలేకపోవడం, పక్కవాళ్ళు నవ్వుతూ ఉంటే ఆ నవ్వులో శృతికలప లేకపోవడం వాళ్ళ కర్మ. గాయకుడు శృతిగా పాడటం ఎంత ముఖ్యమో మనలాంటివాళ్ళు (నా ఉద్దేశం పాటలు పాడటం రాని నాలాంటివాళ్ళు) మాటల్లోనూ, నవ్వులోనూ శృతి కలపడమూ అంత ముఖ్యమే;
అలా అన్నాకదా అని గాయకులు నవ్వకూడదు అని కాదు-వాళ్ళూ నవ్వాలి!
మయసభలో దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వలేదూ (నవ్వు వచ్చింది పగలబడి నవ్వింది-మొహమాట పడకుండా) చాలామంది అపోహపడి ద్రౌపది అలా నవ్వకుండా ఉంటే, బాగుండేది అనుకుంటారు.దుర్యోధనుడు అవమానంగా ఫీల్ అవకుండా ఉంటే అసలు యుద్ధం వచ్చేదా, అంత భారతం జరిగేదా,కురుక్షేత్ర సంగ్రామం జరిగేదా.
మీరు అనవసరంగా అపోహపడి మీనవ్వు వల్ల “ఇండియా- చైనాకో”, “ఇండియా-పాకిస్తాన్ కో” యుద్ధం వచ్చేస్తుందని బెంగపడకండి- అలాంటి అఘాయిత్యం ఏమీ జరగబోదు.నవ్వాలని అనిపించినప్పుడు, నవ్వాల్సిన సందర్భాల్లోనూ మనసారా నవ్వేయండి- “మలబద్ధకం ఉన్నవాళ్ళ” మొహంలాగా మొహం పెట్టక్కర్లేదు ఇబ్బందిగా.
“నవ్వడం ఆరోగ్యమే గానీ తప్పేమీ కాదే”- అసందర్భంగా నవ్వకూడదేమోగానీ నవ్వవలసిన చోట బలవంతంగా ఆపుకోవాల్సిన పనేమిటి.ఈ మధ్య కొంతమంది ఓ దిక్కుమాలిన కామెంట్ పడేస్తున్నారు "అలా గట్టిగా పదిమందిలో నవ్వడం సభ్యత కాదు" అని.అలాంటివేమీ పట్టించుకోకండి “సభ్యతా- చట్టుబండలా”నవ్వడానికి వాళ్లకేమన్నా మాయరోగమేమోగానీ-మనకేం లేదే.
గట్టిగా నవ్వే సందర్భం అయితే నవ్వి పారేయాలి- అవతలవాళ్ళు ఏదో అనుకుంటారని నవ్వడం మానేస్తామా-వాళ్ళు నవ్వలేకపోతే వాళ్లకి రోగం గానీ, మనకేం పోతుంది- పైపెచ్చు నవ్వు ఆరోగ్యానికి మంచిది కూడా.డాక్టర్లు డబ్బులు తీసుకుని మరీ చెప్తుంటారు, “నవ్వుతూ ఉండండి, హాస్యంగా సంభాషించండి ఏ జబ్బూ మీదగ్గరకు రాదు, మీ గుండె నవ్వుతూ నిక్షేపంగా కొట్టుకుంటుంది” అని. ఈ మాత్రం దానికి డాక్టర్ చెప్పాలా- మనకు తెలియదు ఆ విషయం;చిన్నప్పుడు నవ్వేవాళ్ళం గాదా, ఏదో “చటుక్కున పెద్దమనిషి” అయినట్టుగా నవ్వు మానేయాలా- వేషాలుకాకపోతే!
“నవ్వడం ఆరోగ్యం” అనే కదా లాఫింగ్ క్లబ్బుల వాళ్ళు- పార్కుల్లో పడీపడీ నవ్వుతారు- రోజువారీ జీవితంలో ఏ వేషాలు, షోకులు పోకుండా మనసారా నవ్వుతూ- జనాన్ని నవ్విస్తూ ఉంటే- ఈ క్లబ్బుల్లో జేరి బలవంతంగా రోజూ నిర్ణీత సమయంలో నవ్వాల్సిన అవసరం ఏముంది.జనాలు నవ్వడం మర్చిపోయారు కాబట్టి- కనీసం బలవంతంగా అన్నా నవ్విద్దాం అని క్లబ్బుల వాళ్ళ ఉద్దేశం- వీళ్ళ నవ్వులు చూసి పార్కుకి వెళ్లే వాళ్లలో కొంతమంది నవ్వుతుంటారు కూడా!
ఆ మధ్య ఎక్కడో రీసెర్చ్ పేపర్ చదివాను- “నవ్వు గురించి” (ఏమిటో ఈ రోజుల్లో ప్రతీది రీసెర్చ్ చేసి చెప్తే గానీ తెలుసుకోలేని వెర్రి వెంగళప్పల్లా తయారయ్యారు మన దేశవాసులు కూడా-కర్మ) 50-60 ఏళ్ల క్రితం మనిషి “సగటున రోజులో ఓ ముప్పయి నిమిషాలన్నా నవ్వేవాళ్ళుట” క్రమేపి అది తగ్గుతూ వచ్చి పదిఏళ్ళ క్రితం “ఓ పదినిమిషాలకి పడిపోయిందిట” నేననుకోవడం ఇప్పుడు అది “వారానికి పదినిమిషాలు కూడా మనిషి నవ్వడం” మర్చిపోయినట్టున్నాడు.
నవ్వడం, ఏడవడం, క్లబ్బుల్లో చేరి చేయాలా- నవ్వాలి అనిపిస్తే అందరితో కలిసి నవ్వు- ఏడవాలనిపిస్తే- -ఆత్మీయుల దగ్గర ఏడ్చేయ్-లేదూ,ఒక్కడివే కూచ్చోని ఏడ్చేయ్.మనసు తేలికపడ్డ తర్వాత నవ్వుకుంటూ “జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోండి”- సినిమా దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ లాగా!
నవరసాల్లో హాస్యం చాలా ప్రధానమైనది,అందునా ప్రస్తుతం నడుస్తున్న ఒత్తిడి జీవితాల్లో. కార్టూన్ పుస్తకాలు చదవండి,హాస్యంతో ఉన్న పుస్తకాలు చదవండి, లేదా నవ్వులున్న బొమ్మల పుస్తకాలు చూడండి! సరదాగా, హాస్యంగా, ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి వుండండి,హాస్యప్రియుల అయుష్హు దీర్ఘకాలం మరి- ఆలోచించండి.మీలో హాస్యం చేయడం చేతకాకపోయినా, హాస్యగ్రంధులు ఎక్కువగా ఉన్నవాళ్ళతో చెలిమిచేసి సాధ్యమైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడపండి- డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన పనేరాదు.
నా వరకు నేనైతే మా ఫామిలీ డాక్టర్ కి జబ్బులు రాకుండా ఉండటానికి కారణం నేనే- ఆవిడ జనానికి మందులు ఇస్తూ ఉంటే నేనుమాత్రం హాస్యం పండిస్తూ ఉంటా కబుర్లతో- వాళ్ళ ఇంటిల్లిపాదికీనూ!
లేదూ, మీకు “తెలిసినవాళ్ళు” ఎవరూ లేకపోతే (నా ఉద్దేశం హాస్యప్రియులు) కాసేపు టి.వి ఆన్ చేసి తెలుగు సినిమాల్లోని హాస్య సన్నివేశాలు ఓ పది నిమిషాలు చూసేయండి- టక్కున నవ్వుకుంటారు- పగలబడి-కడుపుబ్బా! ఒక్కోసారి ఆ నవ్వుకి కడుపునిండిపోయి ఆకలికూడా వేయదు- ఆ దెబ్బతో మీరు “చేయాలనుకున్న, చేయలేని డైటింగ్” కూడా అయిపోతుంది- ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అంటే ఇదే మరి!
మన తెలుగు సినీ చిత్రజగత్తులో ఉన్నంతమంది కమెడియన్స్ ఇంకో ఫిలిం ఫీల్డ్ లో ఉన్నారా- వీరిలో ఎవరి వైవిద్యం వాళ్లదే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా నవ్విస్తుంటారు వాళ్ళ ట్రేడ్ మార్క్ అభినయంతో.
లేదా నా ఫోన్ నెంబర్ తెలుసుకదా ఓ ఫోన్ కొట్టండి- కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుందాం సరదాగా-ఓ పది నిమిషాలు మీ ఆయుష్షు పెరగడం ఖాయం-నాది గ్యారంటీ! నవ్వుతూ బతికేయడం అలవాటుగా మార్చుకోండి-అనారోగ్యం మీ దరిదాపులకు కూడా చేరడానికి హడిలిపోతుంది!గుండెల్లో ఉన్న బెంగ ఒక్క నవ్వుతో “హుష్ కాకీ” అయి మాయమైపోతుంది-ఇంక గుండెకు జబ్బు ఎందుకు చేస్తుంది! అందుకే ప్రముఖ హృద్రోగనిపుణులు ఇచ్చే సలహా: “గుండెజబ్బు దరి చేరకుండా ఉండాలంటే నవ్వే పరమౌషధం”
నవ్వలేని, నవ్వించలేని జీవితం ఎందుకు చెప్పండి- ఏడవటానికా!
సీరియస్ గా నేను ఇంత చెప్పాక కూడా మీరు రోజూ నవ్వలేరు అంటే-మీ ఇష్టం మరి